నిజమైన భక్తి - దేవుణ్ని ప్రశ్నిస్తే...? జిందగీ-చింతన || నమస్తే తెలంగాణ హైదరాబాద్-సోమవారం 13-03-2023



నమస్తే తెలంగాణ హైదరాబాద్-సోమవారం 13 మార్చి 2023

జిందగీ-చింతన

నిజమైన భక్తి

భక్తి అనేది ఓ మధురమైన భావన. భగవంతుడి కోసం తన అనుకున్న సర్వస్వాన్నీ అర్పించటమే భక్తి. నిజమైన భక్తి అనుభవైకవేద్యమైనదే తప్ప ఇదీ అని చెప్పగలిగేది కాదు. అందుకే నిజమైన భక్తుడు నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు.

దేవుణ్ని ప్రశ్నిస్తే...?

భక్తి ఉన్నంత మాత్రాన ప్రశ్నించకూడదనేమీ లేదు. ప్రశ్నకు తగిన సమాధానం దొరికితే భక్తి మరింత పెరుగుతుంది. కార్యకారణ సంబంధాలను విశ్లేషించిన తరువాత ఏర్పడే భక్తిలో గాఢత ఎక్కువగా ఉంటుంది. కొడుకుకు ఏదైనా సందేహం వస్తే తండ్రిని ప్రశ్నిస్తాడు కదా! అనుమానం నివృత్తి చేసుకుంటాడు కదా! మరి జగత్తుకు తండ్రి అయిన దేవుడిని ప్రశ్నిస్తే మాత్రం తప్పేముంది. దేవుడు కూడా తనను నిలదీసే భక్తులను ఎక్కువ అనుగ్రహిస్తాడు. కత్తి పదునుతేలాలి అంటే సానబెట్టాలి.

భక్తికీ అంతే! ఆటవికుడైన తిన్నడు పరమశివుడిని అంత తేలిగ్గా నమ్మలేదు. 'అసలు నువ్వెవరు?' అని ప్రశ్నించాడు. 'నీ జాడ ఎక్కడ?' అని నిలదీశాడు. భగవంతుడి జాడను తెలుసుకున్నాకే విశ్వసించాడు. పరమ భక్తుడిగా మారాడు. భాగవతం రాసిన పోతనామాత్యుడు పరమ భాగవతోత్తముడు. అయితేనేం. ఆయన దేవుడి గురించి బోలెడన్ని ప్రశ్నలు సంధించాడు. భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాట పడటం, ఏడ్వటం, బాధ పడటం... అన్నీ భక్తికి నిదర్శనాలే. భగవంతుడికి అన్నీ అర్పించడమే భక్తి. కలిమి లేముల్లో, సుఖదుఃఖాల్లో... ఒకటేమిటి ప్రతిస్థితిలో, ప్రతి అవస్థలో, అన్ని వ్యవస్థల్లో, అంతటిలో భగవంతుడిని చూడగలగడమే భక్తి. అనుక్షణం అణువణువునా పరమాత్మను హృదయంలో దర్శించడం భక్తి అవుతుంది. భగవంతుడిని అనుభవించటం భక్తి. అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి. తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు తమకు తోచిన రీతిలోmప్రార్థిస్తుంటారు. మంత్రాలు పఠిస్తారు. పూజలు,జపాలు చేస్తారు. ఇంకొంతమంది కోరికలు నెరవేరడానికి ఉపవాసాలు ఉంటుంటారు. వ్రతాలు చేస్తుంటారు. ఇవన్నీ భక్తి కలిగిన వారు చేసే వివిధ సాధనా మార్గాలు మాత్రమే. అంతేకానీ పరిపూర్ణ భక్తికి ప్రతీకలు మాత్రం కావు. భగవంతుడిని ఆరాధించే కొద్దిసేపైనా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునిపైనే మనసును లగ్నం చేసి తనను తాను భగవంతుడికి అర్పణ చేసుకోవడమే అసలైన భక్తి అవుతుంది. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతుడికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తిమార్గం మాత్రమే.

భగవంతుడిని మనసా స్మరిస్తూ, అన్యథాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుడిని స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి. శివుడిపై నందీశ్వరునికి ఉండేది భక్తి. గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవంతుడితత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది. భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోర్కెల చిట్టా చదవటం కాదు. ముడుపుల పేరుతో దేవుడితో లావాదేవీలు జరపడం అంతకన్నాకాదు. ఇవన్నీ కేవలం సాధనా మార్గాలు మాత్రమే. కోర్కెల గురించి మాత్రమే సర్వాంతర్యామిని ప్రార్థించాలనుకునేవారికి అసలు భక్తితత్వం బోధపడలేదని తెలుసుకోవాలి. పరమాత్మసర్వాంతర్యామి. ఆయనకు తెలియనిది లేదు. అలాంటి సర్వవ్యాపకుడికి మన కోర్కెలు తెలిపి, 'ఇదీ నా ఫలానా అవసరం, దాన్ని తీర్చు' అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా! మనతోపాటు, మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని సృష్టించిన ఆ దేవదేవుడికి, మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా..?

భగవంతుడిపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. మరి భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెబుతారు? అనే ప్రశ్న ఉదయించినప్పుడే ఆలోచన, సాధన మొదలవుతాయి. అవే క్రమంగా పరిశోధనగా మారతాయి. నచికేతుడి తండ్రి వాజశ్రవుడు. అతడు విశ్వజిత్ అనే యాగం చేస్తూ అందులో భాగంగా అనేక దానాలు చేస్తుంటాడు. తండ్రి చేస్తున్న దానాల్ని గమనించిన నచికేతుడు ‘నాన్నా! నన్ను ఎవరికి దానంచేస్తావు?' అని అడిగాడు. యాగ పనులతో తీరికలేకుండా ఉన్న వాజశ్రవుడు పిల్లవాడి మాటలకు

విసుగెత్తి 'నిన్ను యముడికి దానం ఇచ్చాను' అన్నాడు. వెంటనే నచికేతుడు తనను తాను సమర్పించుకునేందుకు యముడి వద్దకు వెళ్లాడు. యముడు పిల్లాడిని చూసి ముచ్చటపడి మూడు వరాలు ఇస్తానంటాడు. అందులో ఒక వరంగా బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమంటాడు నచికేతుడు. పసిబాలుడు ఊహించని వరం కోరేసరికి ఆశ్చర్య

పోతాడు యముడు. అనేక ఆశలు చూపించి అతని దృష్టి మరల్చాలని చూస్తాడు. కానీ, నచికేతుడు దేనికీ లొంగడు. తన ప్రశ్నకు సమాధానం కావాలని పట్టుబడతాడు. బాలుడి పట్టుదలకు సంతోషించిన యముడు అతడికి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. అదే కఠోపనిషత్తుగా అవతరించి అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నది.

ఇలా తెలుసుకోవాలన్న తపన ప్రశ్నించిన భక్తుడి తోపాటు మనందరినీ తరింపజేసింది.

భగవంతుని పొందడానికి భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇలా తొమ్మిది రకాల మార్గాలు సూచించారు. ఇవే నవవిధ భక్తిమార్గాలుగా ప్రసిద్ధి. ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంతిమంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. నిర్మలమైన భక్తికి భగవం

తుడి అందదండలు ఉంటాయి. నిశ్చలమైన భక్తుడికి స్వామి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది.

డా కప్పగంతు రామకృష్ణ


Comments

Popular posts from this blog

#గరిమెళ్ళ_బాలకృష్ణప్రసాద్ #అన్నమయ్య_పదవిహారం#ఆంజనేయ_గుణధామ#ఆంజనేయ కృతిమణిమాల#BIO-DATA ALSO

#annamacharyakeerthanalu#25FOLDERS 978 FILES#mediafire LINKS

G.BALAKRISHNA PRASAD ANNAMAYYA KIRTANALU mp3 folder & lyrics PDF link